Online Puja Services

నాయనార్ల గాథలు - శ్రీ తిరు నీలకంఠ యాజ్ పనార్ నాయనారు .

3.142.255.5

నాయనార్ల గాథలు - శ్రీ తిరు నీలకంఠ యాజ్ పనార్ నాయనారు . 
లక్ష్మీ రమణ. 

సంగీతానికి - భగవంతుని అనుగ్రహానికి ఏవో విడదీయరాని సంబంధం ఉంది. సాహిత్యానికి - భగవంతుని సాన్నిహిత్యానికి గొప్ప అనుబంధమేదో ఉంది . ఆ ఆల్కెమీ ఏదో త్యాగయ్యకు, ముత్తుస్వామి దీక్షితార్ కు, శ్యామశాస్రికి,  అన్నమయ్యకు , రామదాసు తదితరులకు బాగా తెలుసు . అందుకే తమ మాటతో మంత్రమేసి , పాటతో పరవశింపజేసి ఆ పరమాత్మని రంజింపజేశారు.  నా కోసం, నా మీద  ఒక్క పాట పాడవా అని ఆ దేవదేవుడే/ ఆ పరమాత్మికయే వచ్చి అడిగారంటే, ఆ భక్తాగ్రేశ్వరుల మాటకి , పాటకి ఎంత మాధుర్యం నిండిన మాహత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. పాట , మాట మాత్రమే కాదు వాటిని స్వరలయలతో శృతిబద్ధంగా పలికించే వాయిద్యకారులు కూడా ఈ కోవకే చెందుతారు.  సరిగమలు ఏ సంగీతంలోనైనా ఒక్కటే కావొచ్చు . కానీ, భారతావనిలోని భాష , యాస ప్రాంతీయతతో మారినట్టు అనేకానేక సంప్రదాయ వాద్యాలు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి.  అనేకం ఏకమయ్యే తత్త్వం ఈ నేలలోని అణువణువుకీ పరిచయమే కదా !

అటువంటి తమిళ సీమల యాజ్/ యాళి వాయిద్యపు స్వరధనులే తన మాటగా , పాటగా మలిచి ఆ ఈశ్వరుని చేరినవారు , ఈశ్వరుడే కోరి మరీ బంగారు పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన నాయనారు శ్రీ తిరు నీలకంఠ యాజ్ పనార్ . అక్షరాలన్నీ ఆయన యాళీ స్వర ధ్వనులై పలికే ఆ దివ్య కమనీయ చరితని ఇక్కడ చెప్పుకుందాం . 

అది చోళులు పరిపాలిస్తున్న కాలం.  బౌద్ధం , జైనం ఉచ్ఛదశలో ఉన్నాయి.  ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవానుడు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ కాలంలో ఎందరెందరో మహానుభావులు ఉద్భవించారు. వారిలో శ్రీ తిరు నీలకంఠ యాజ్ పనార్ ఒకరు. 

  చోళ రాజ్యంలో తిరు ఏరుకట్టన్ పులియారు అనే గ్రామంలో యాజ్ పనార్ జన్మించారు.  ఆయన యాళి (ఒక రకమైన సంప్రదాయ సంగీత వాయిద్యం)  మీద మృదుమనోహరంగా భక్తి గీతాలని పలికించేవారు. మనుషులే కాదు ఆ స్వరలయకి పశు పక్ష్యాదులు కూడా పరవశించిపోయేవి. ఊరూరా తిరుగుతూ, దేవాలయాలు దర్శిస్తూ , ఆయా ఆలయాల్లో, క్షేతాల్లో కొలువైన దైవాన్ని తన యాజ్ మీద కీర్తిస్తూ ముందుకు సాగేవారు యాజ్ పవనార్. ఆ విధంగా ఆయన మధురకి ప్రయాణమయ్యారు. 

సర్వాంతర్యామి అయిన ఆ ఈశ్వరుడు కూడా ఆయన పలికించే యాళీ స్వర తరంగాలకు ముగ్దుడయ్యారు. మధురలో కొలువైన సుందరేశ్వరుడు తన భక్తులకి కలలో కనిపించి, తన ఆలయానికి యాజ్ పవనార్ ని ఆహ్వానించి ఆయనచేత పాడించామని ఆదేశించాడు .  అంతే కాదు, అశరీర వాణి ద్వారా  “పవనార్  యాజ్ ని తడి నేలమీద పెడితే పాడైపోతుంది. అందువల్ల ఆయనకీ ఒక బంగారు సింహాసనాన్ని ఇచ్చి దానిపై ఆయన కూర్చొని యాళిని వాయించేలా చూడమని” ఆదేశించారు .  

రాజరాజులకే రాజైనవాడు ఆ ఈశ్వరుడు తలచుకొంటే , ఇటువంటి ఐశ్వర్యాలకి కొదవా ? చక్కగా అలంకరించిన బంగారు ఆసనాన్ని వేసి, యాజ్ పవనార్ చేత యాజ్ వాద్యాన్ని ఆలపించేలా చేశారు. ఆ సుందరేశ్వరునికి కృపకి, ఆప్యాయతకి, ఆర్ద్రతతో  నిలువెల్లా ఆనందాశృవులతో తడిసిపోయారు యాజ్ పవనార్.  అనంతమైన భక్తిని తన గుండె గుడిలో నుంచి తీసి , యాళీ తంత్రులపై శృతిబద్ధం చేసి , భక్తుల హృదయాల్ని ఆ సుందరేశ్వరునిలో లయం చేసేసి ఒక అద్భుత తన్మయ దృశ్యాన్ని  ఆవిష్కరించారు . 

ఆ తర్వాత తిరువారూర్ చేరారు. అక్కడి సుప్రసిద్ధ  త్యాగరాజస్వామి ఆలయం బయట తన స్వరధుని వినిపిస్తున్నారు.  అప్పుడు స్వయంగా త్యాగరాజస్వామి  తన ఉత్తరద్వారాన్ని తెరిపించి తన సాన్నిధ్యంలో యాజ్ పవనార్ గానం చేయాలని ఆదేశించారు .   ఆ విధంగా ఆయన్ని భగవంతుడే  ఆహ్వానించి తన సాన్నిధ్యంలో పాడే అవకాశాన్నిచ్చి, ఆదరించారు.  ఇంతకన్నా ఒక సంగీతజ్ఞుడికి,  భక్తుడికి కావాలినదేముంటుంది! భగవంతుని అనుగ్రహం అనంతకారుమేఘమై యాజ్ పవనార్ ని తన అనుగ్రహామృత దారాలతో అభిషేకించేసింది !

ఆవిధంగా , స్వయంగా ఆ అమ్మలగన్నయమ్మ ఆదిదేవి పార్వతీమాత స్తన్యాన్ని స్వీకరించి జ్ఞాన సంబందార్ తో కలిసి యాజ్ పవనార్ ఎన్నో గీతాలని, జ్ఞాన సంబందార్ తేవారాలని తన యాజ్ మీద సుమధురంగా , మనోహరంగా ఆలపించారు . 

అంతేకాదు, ఙ్ఞాన సంబందార్ తో కలిసి అనంత దివ్య జ్యోతి కాంతి పథంలో నడుస్తూ, అంత్యాన శాశ్వత శివ సాయుజ్యాన్ని పొందారు . ఇప్పటికీ యాజ్ వాయిద్యాన్ని, తేవారాలనీ గానం చేసేప్పుడు సంగీత పిపాసులు తిరు నీలకంఠ యాజ్ పవనార్ ని తప్పక స్మరించుకుంటూ ఉంటారు .  

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణమస్తు ! 

శుభం . 

 

 

Nayanar, Stories, Tiru, Nilakanta, Yazhpanar, Shiva, Siva,

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi